రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డి లో జగ్గారెడ్డి, నిర్మల దీక్ష
సంగారెడ్డి, అక్టోబర్ 7 (స్పందన) దేశ ప్రజల ఓటు హక్కును, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ బలపడిన రాష్ట్రాల్లో ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సహకారంతోనే బీజేపీ మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఈ అంశంపై రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రశ్నలు లేవనెత్తారని పేర్కొన్నారు.ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయ పోరాటం కాదు.. దేశ ప్రజల ఓటు హక్కును కాపాడే రాజకీయ యుద్ధం. దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ రోడ్డుపై కూర్చొని పోరాడుతున్నారు” అని జగ్గారెడ్డి అన్నారు.సర్ ప్రక్రియలోనూ ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, ఓటర్ల జాబితాల విషయంలో తలెత్తుతున్న వివాదాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. దేశ ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన ఖండించారు.రాహుల్ గాంధీ పోరాటం చేసినన్ని రోజులు సంగారెడ్డిలో మేము కూడా దీక్ష కొనసాగిస్తాం. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా మా పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.దేశంలో స్వతంత్ర ఎన్నికల వ్యవస్థకు పునాదులు పడిన కాలం నుంచి నెహ్రూ–గాంధీ కుటుంబం ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు కోల్పోయారని, సోనియా గాంధీ సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో సేవలందించారని గుర్తుచేశారు.త్యాగాల చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ ప్రజల ఓటు హక్కు కోసం పోరాడుతున్నారు. ఆయన పోరాటానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతుగా నిలవాలి” అని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.దీక్షలో నిర్మల జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు