వికారాబాద్ జిల్లా అనంతగిరిలో బస్సు ప్రమాదం, నలుగురు మృతి

వికారాబాద్, అక్టోబర్ 3: జిల్లాలోని అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు(శనివారం) ఉదయం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అయితే తీవ్రంగా గాయపడిన ప్రయాణికుల్లో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.